Munugode: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథ రావునుసస్పెండ్ చేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ పై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా మునుగోడులో ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును జగన్నాథరావు మార్చడం వివాదంగా మారింది. దీనిపై విచారణ నిర్వహించి పంపిన నివేదిక మేరకు ఎన్నికల బాధ్యతల నుంచి కేద్ర ఎన్నికల సంఘం ఆయనను తప్పించి వెంటనే అప్పట్లో మరో అధికారిని నియమించింది.
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వివరించారు. ఎన్నికల నియామావళిని, వ్యయ నిబంధనలను అతిక్రమించినా, రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడినా సీవిజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు వచ్చిన వంద నిముషాల్లో అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుని చర్యలు తీసుకుంటారు.
మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉపఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకులను రంగంలోకి దించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించింది.