Hyderabad: తెలంగాణలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించనున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.
కేసులో నిందుతులను విచారించేందుకు హైకోర్టు కూడా పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వానికి చెందిన పార్టీ శ్రేణులు కొందరు రాజ్ భవన్ ను సైతం ప్రలోభాల కేసులో చేర్చే ప్రయత్నం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, కుట్రగా భావించాల్సి వస్తుందని, ప్రలోభాల వ్యవహారంలో న్యాయమూర్తితో గాని, సీబీఐతో గాని విచారణ చేయించాలని తెలంగాణ భాజపా హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది.
ఇది కూడా చదవండి: Governor Tamilisai: తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. గవర్నర్ తమిళిసై