Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మెుదట బండి సంజయ్ ను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ వైపు తరలిస్తున్నారు. దీంతో పోలీసు వాహనాలను భాజపా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.
వరంగల్ వైపు బండి సంజయ్ (Bandi Sanjay)
బండి సంజయ్ ను బొమ్మల రామారం నుంచి బయటకు తరలించారు. భాజపా నేతల ఆందోళన ఎక్కువ కావడంతో.. పోలీసులు ఆయన్ని పాలకుర్తి మీదుగా వర్ధన్నపేట్ తరలించారు.
అక్కడి నుంచి.. వరంగల్ కోర్టులో బండి సంజయ్ ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
కోర్టులో హాజరు పరిచే విషయంపై పోలీసులు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో బండి సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
దీనికి ముందు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ.. భాజపా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.
సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బండి సంజయ్ ను పరామర్శించేందుకు వచ్చిన రఘునందన్‌రావు, కూన శ్రీశైలం గౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తిప్పడంపై.. హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని హెబియస్ కార్పస్ పిటిషన్ ను భాజపా నేత సాంరెడ్డి సురేందర్‌రెడ్డి వేశారు.
బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఇందులో పేర్కొన్నారు.
ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో కనీస నిబంధనలను పోలీసులు పాటించలేదని.. విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలపలేదని ఆక్షేపించింది.
ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..
బండి సంజయ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలను నమోదు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు.
దీంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద భాజపా నేతలు ధర్నాలు చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడితో భాజపా నేత కొద్ది రోజులుగా టచ్ లో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.విద్యార్ధుల్లో గందరగోళం సృష్టించడానికే ఈ లీకేజీలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.