Pawan Kalyan: లాడ్జి ఘటన దురదృష్టకరంగా పేర్కొన్న పవన్ కళ్యాణ్

సికింద్రాబాద్, అడ్డగుట్టలో నిన్నటిదినం రాత్రి రూబీ లాడ్జి ఎలక్ట్రిక్ స్కూటర్ల దుకాణంలో చోటుచేసుకొన్న ఘటనను నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ దురదృష్టకరంగా పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Amravati: సికింద్రాబాద్ రూబీ లాడ్జి ఎలక్ట్రిక్ స్కూటర్ల దుకాణంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల తాను ఆవేదనకు గురైనట్లు పవన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్ అగ్ని ప్రమాదం ఘటనలో పలువురు క్షతగాత్రులయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందినట్లు చెప్పారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. పర్యాటకంగా, వాణిజ్యపరంగా, ఐటీ రంగంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాజధానిలో ఇటువంటి ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు. హోటల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో ఎప్పటికప్పుడు అగ్నిమాపక వ్యవస్ధలతో రక్షణ తనిఖీలు చేయించాలని తెలంగాణ మంత్రి కేటిఆర్‌కు పవన్‌ కళ్యాణ్ కు సూచించారు.

మరోవైపు అడ్డగుట్టలోని స్ధానికులు రూబీ హోటల్ నందు చోటు చేసుకొన్న ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నారు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల దుకాణాలకు అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఉన్న బహుళ అంతస్ధులను తనిఖీలు చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు 8 నిండు ప్రాణాలు అంటూ స్థానికులు నిట్టూర్పు విడవడం గమనార్హం.