KTR Comments: ప్రశ్నపత్రం వ్యవహారంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దీని వెనకు ఎవరున్న వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కేవలం ఇద్దరు చేసిన తప్పుల వల్ల.. సంస్థను నిందించటం సరికాదని ఆయన అన్నారు.
కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ (KTR Comments)
ప్రశ్నపత్రంలో లీకేజీలో ఇద్దరు నిందితులతో పాటు.. వారి వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డే కాకుండా.. వారి వెనక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్ లో ఇద్దరు వ్యక్తలు చేసిన తప్పు వల్లే.. మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది సంస్థాగత వైఫల్యం కాదని.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ఇప్పటి వరకు పబ్లిక్ కమిషన్ ద్వారా.. 155 నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఎనిమిదేళ్లుగా టీఎస్‌పీఎస్సీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఏకకాలంలో 10లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్సీదేనని చెప్పారు. ఉమ్మడి ఏపీలో అప్పటి కమిషన్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని.. కానీ టీఎస్‌పీఎస్సీ మీద ఒక్క ఆరోపణ కూడా రాలేదని అన్నారు. దురదృష్టం కొద్దీ అదే కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిందని తెలిపారు.
త్వరలో మళ్లీ పరీక్షలు..
రానున్న రోజుల్లో కమిషన్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. దీనికోసం కమిషన్ లో మార్పులు చేస్తామని తెలిపారు.
రద్దయిన పరీక్షలను రాసే విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదన్నారు. రద్దైన నాలుగు పరీక్షలను త్వరలోనే నిర్ణయిస్తామని ప్రకటించారు.
సమూలంగా మార్పులు తీసుకొచ్చి ఎలాంటి పొరపాట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకొని సాధ్యమైనంత మేర పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా మళ్లీ పరీక్ష రాయవచ్చని అన్నారు.
అందుబాటులో మెటీరియల్
రద్దైన నాలుగు పరీక్షలకు సంబంధించి కోచింగ్ మెటీరియల్ ను ఆన్ లైన్ అందుబాటులో ఉంచుతామని కేటీఆర్ అన్నారు.
మెటీరియల్ ను ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రీడింగ్ రూమ్‌లను సైతం 24గంటలూ తెరిచి ఉంచాలని కేటీఆర్ సూచించారు. దీంతో పాటు.. ఉచిత భోజన వసతి కూడా తీసుకువస్తామని వివరించారు.