Rangareddy: సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మహా అంటే రూ. 500 నుంచి రూ.1000లోపు ఉంటుంది. కానీ ఓ ఇంటి యజమానికి మాత్రం కేవలం 22 రోజులకే దాదాపు లక్షరూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఇంటి యజమానికి గుండె గు”బిల్లు”మంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లిలో నివాసం ఉంటున్న రమాదేవి ఇంట్లో గతనెలలో విద్యుత్ మీటర్ కాలిపోయింది. దానితో ఆమె విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేయగా, విద్యుత్ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారట. అయితే గత నెలలో కాలిపోయిన విద్యుత్ మీటర్‌కు సంబంధించిన కరెంటు బిల్లును బుధవారం విద్యుత్ శాఖ సిబ్బంది ఆ ఇంటి యజమానికి ఇచ్చారు. ఆ బిల్లు చూసిన రమాదేవి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అనగా 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు అందుకుగానూ రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో ఉంది.
ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒక్కసారిగా లక్ష రూపాయలకు పైగా రావడం చూసి రమాదేవి ఆందోళన చెందారు. ఈ విషయం పై విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రాకేశ్‌ను అడుగగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, తెలుసుకుని సరిచేస్తామని సమాధానం ఇచ్చారని రమాదేవి అన్నారు. ఇప్పుడు ఈ విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.