Kumaraswamy: కేసీఆర్ కు ఫుల్ సపోర్ట్.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు అపార‌ అనుభవం ఉందని,

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 02:03 PM IST

Hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు అపార‌ అనుభవం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఆయ‌న సేవ‌లు ఎంతో అవసరం ఉన్నాయ‌ని హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్, త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు.

కేసీఆర్ ఆదివారం కుమారస్వామితో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పోషించాల్సిన పాత్ర పై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయస్థాయిలో పార్టీ స్థాపించాలని భావిస్తున్న కేసీఆర్ తన ఆలోచనలను జేడీఎస్ నేత కుమారస్వామితో పంచుకున్నారు. పార్టీ రూపురేఖలను, సిద్ధాంతాలను, విధివిధానాలను కుమారస్వామికి వివరించారు. పలు రాష్ట్రాల్లో తను సాగించిన పర్యటనల తాలూకు వివరాలను ఆయనకు వివరించారు.

దసరాకు జాతీయపార్టీని ప్రారంభించే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురి తో సమావేశమయ్యారు.