Komatireddy Venkat Reddy: రాజకీయాలకు ఉన్న సమయం పరామర్శకు లేదా? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 11:21 AM IST

Hyderabad: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానంలో బిహార్‌ రాజధాని పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే సమయం ఉందా అని విమర్శించారు. పేదల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయా అని నిలదీశారు.

ప్రగతి భవన్‌ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లకుండా రాజకీయాల కోసం పాట్నాకు వెళ్లడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందామని చూస్తే కుదరదన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 30 మంది బాధిత మహిళల ఆరోగ్యానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, బాధిత మహిళలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.

పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉండే ఇబ్రహీంపట్నంలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బస్తీ దవాఖానా పేరుతో అనవసర ప్రచారం ఆపి ఎక్కువ మంది సివిల్‌ సర్జన్లను నియమించి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదు కదా అని అభిప్రాయపడ్డారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా రాకపోవడం శోచనీయమన్నారు. అనుకూల మీడియాలో వైద్య, ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. నలుగురి ప్రాణాలను బలిగొన్న వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయడమే కాక, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.