Abdullapurmet Murder: అబ్దుల్లాపూర్ మెట్ లో యువకుడి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య తర్వాత నిందితుడు హరిహర కృష్ణ సైకోలా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి.. ఆ రోజు అక్కడే గడిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హసన్‌ను విచారించారు. హత్యకు ముందు.. హరి యువతితో సహజీవనం చేస్తున్న విషయాన్ని నవీన్‌కు తెలిపాడు. ఇదే విషయంపై గొడవ జరిగిందని హరే తనతో చెప్పాడని హసన్ పోలీసులకు వివరించాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావటంతో .. హరి నవీన్ గొంతు నులుమి హత్య చేశాడు. నవీన్ మరణించాక శరీర భాగాలను వేరు చేయాలని భావించాడు. దీంతో చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కత్తితో కోసి, ధ్వంసం చేసినట్లు హరి తనతో వివరించాడని హసన్ పోలీసులకు తెలిపాడు.
హత్యలో యువతి ప్రమేయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో యువతి పాత్రపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. యువతి సెల్‌ఫోన్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పలు కీలక ఆధారులు గుర్తించారు. నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియోను, ఫొటోలను హరి యువతికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత నవీన్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన యువతి.. ఆ తర్వాత అతడిని దూరం పెట్టింది. కొద్ది రోజుల తర్వాత హరిహర కృష్ణతో ప్రేమాయణం సాగించింది. ఈ విషయం నవీన్ కు తెలియకపోవటంతో.. తరుచూ యువతికి ఫోన్ చేయడం, సందేశాలు పంపించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.
అయితే నవీన్ తో జరిగిన ప్రేమాయణం గురించి.. హరికి యువతి చెప్పకుండా దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం ఎందుకు చెప్పలేదో.. దీని వెనక ఏదైనా కారణం ఉందేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే హరి, నవీన్‌లు అప్పటికే స్నేహితులు. యువతితో సహజీవనం చేస్తున్న హరి.. అమ్మాయితో కలిసున్న ప్రతిసారి ఫోన్ చేస్తుండటాన్ని గమనించాడు. దీంతో నవీన్ పై కోపం పెంచుకున్నాడు. నవీన్ తో ఎలాగైన అడ్డుతప్పించాలని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసును లోతుగా విచారించేందుకు నిందితుడు హరిని కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయవలసి ఉందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.