Hyderabad: టీఆర్ఎస్ గూండాలు కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్ విసిరారు. శుక్రవారంనాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా దొరల పాలన సాగుతుందని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
70 ఏళ్ల వయస్సున్న తన తల్లిని భయపెట్టే హక్కు ఎవరిచ్చారని అరవింద్ ప్రశ్నించారు. తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అరవింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని, టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని.. కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ అని అరవింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్ కేసు పెట్టాలని కవితకు సలహా ఇచ్చారు ఎంపీ అరవింద్. మీ నాన్న ఇంటిని ధ్వంసం చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడినట్టుగా తనకు ఎఐసీసీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పారన్నారు. అదే విషయాన్ని తాను మీడియాలో మాట్లాడినట్టుగా అరవింద్ తెలిపారు. ఈ వ్యాఖ్యల్లో తప్పేం ఉందో చెప్పాలన్నారు. బీజేపీలో చేరాలని కవితను కూడా అడిగినట్టుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయలేదా అని అరవింద్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను కూడా కొడతావా అని అరవింద్ అడిగారు. ఇంతగా రియాక్ట్ అవుతున్నారంటే ఇందులో నిజముందని అనుకొంటున్నానని అరవింద్ తెలిపారు. కవితపై తాను అనుచిత వ్యాఖ్యలు ఏం చేశానో చెప్పాలని అరవింద్ కోరారు. కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన కీలక నేతలతో కవిత మాట్లాడిన ఫోన్ కాల్ నిజమో కాదో తెలాల్సిన అవసరం ఉందని అరవింద్ అన్నారు.