Hyderabad Rain: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్, సంతోష్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, చంపాపేట్, సైదాబాద్, ఐఎస్ సదన్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మే 10 నాటికి తుపానుగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర వాయువ్యదిశగా మే 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర, ఉత్తర ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు వెళ్తుందని పేర్కొంది. ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కి.మీ ఎత్తులో వ్యాపించి ఉందని వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.