Hyderabad: నేడు పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. నేటి మధ్యాహ్నం ప్రార్థనల కోసం ముస్లింలందరూ బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో అలర్ట్‌గా ఉండాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఓల్డ్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మసీదుల వద్ద పోలీసులను మోహరించాలని సూచించారు. చార్మినార్, మక్కామసీదు ఏరియాల్లో దాదాపు 5 వేల మంది ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తమ నివాసాలకు దగ్గర్లో ఉన్న మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని, అనవసరంగా బయటకు రావొద్దని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.