Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి గుర్తును రిటర్నింగ్ అధికారి మార్చేశారు. ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యుగతులసి పార్టీ అభ్యర్ధి కె. శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును తొలుత కేటాయించారు. అనంతరం బేబీ వాకర్ గుర్తుకు మారుస్తూ రిటర్నింగ్ అధికారి స్వంతంగా నిర్ణయం తీసుకొన్నారు. జరిగిన గుర్తు మార్పును అభ్యర్ధి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
తప్పుబట్టిన ఈసీ వెంటనే కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని స్పష్టం చేసింది. అసలు అలా ఎందుకు అభ్యర్ధి గుర్తును మార్చాల్సి వచ్చిందో ఆర్వో నుండి వివరణ తీసుకోవాలని, నివేదికను సాయంత్రం లోపు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫారం 7(ఎ)ను ఎన్నికల అధికారులు సవరించారు. అభ్యర్ధి శివకుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మారిన గుర్తులతో బ్యాలెట్ ముద్రణకు చర్యలు తీసుకోనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తొలి నుండి కొన్ని గుర్తులను తొలగించాలంటూ ఈసీని పదే పదే కోరివుంది. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఈ దశలో విచారణకు తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తెరాస అభ్యంతరం చేసిన గుర్తుల్లో రోడ్డు రోలర్ కూడా ఉండడం గమనార్హం.