Site icon Prime9

Cyclone Mocha: ముంచుకొస్తున్న “మోచా”.. భయపడొద్దు ఆదుకుంటామన్న కేసీఆర్

Cyclone Mocha: ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోచా ముప్పు(Cyclone Mocha)

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారి ఈ నెల 8, 9 తేదీల్లో ఈదురుగాలులు మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

సాయం ప్రకటించిన ప్రభుత్వం

కాగా ఇప్పటికే కొద్దిరోజులు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాల ధాటికి పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న ధ్వంసం కావడంతో నిమ్మ, బత్తాయి, మామిడి వంటి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే టైంలో ఇలా పంటంతా వర్షార్పణం అవడం వల్ల అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాగా.. రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తడిసిన ప్రతిగింజను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం కింద రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version