Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు దిల్లీలో
కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో భాజపాను మరింత బలోపేతం చేస్తామని బండి సంజయ్ అన్నారు.
జేపీ నడ్డా.. అమిత్ షా తో తెలంగాణ నేతల భేటీ.. (Bandi Sanjay)
దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం.. బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. అభివృద్ధి కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో భాజపా చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్స్..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలతో పాటు కార్నర్ మీటింగ్స్ నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు.. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు మోదీని ఆహ్వానిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. భాజపా సిద్దంగా ఉందని. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు. భాజపాకు అభ్యర్థులు లేరనే విషయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భాజపాకు ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలున్నారని అన్నారు. భాజపా ప్రస్థానం రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమై.. నేడు 300 సీట్లు దాటిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిల్లీ లిక్కర్ స్కాంపై బండి సంజయ్ స్పందించారు. ఈ కేసుకు భాజపాకు సంబంధం లేదని.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. లిక్కర్ కేసు లో కవిత పేరును ప్రస్తావించిన.. కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అమిత్ షా కీలక సూచనలు..
తెలంగాణ భాజపా నేతలతో సమావేశమైన అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లేలా అనుసరించాల్సిన వ్యూహాలపై.. నేతలకు పలు కీలక సూచనలు చేశారు. భాజపా చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని.. మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నేతలంతా సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలని.. అప్పుడే రాష్ట్ర సమస్యలను ప్రజలు అర్ధం చేసుకుంటారని వారు సూచించారు. తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ఇంటింటికీ కమలం కార్యక్రమం చేపట్టాలని అమిత్ షా సూచించారు.