Site icon Prime9

Bandi Sanjay: ఒక్క రాష్ట్రంలో గెలవగానే సరిపోతుందా.. కర్ణాటక ఫలితాలపై బండి సెటైర్లు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరో వైపు భారతీయ జనతా పార్టీ 65 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ఏ రాష్ట్రంలో నైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు.

ఒక రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్ ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుంది అనుకోవడం సరికాదని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు రాగా, తాజా ఎన్నికల్లో కూడా అదే 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని చెప్పారు. అదే విధంగా జేడీఎస్‌ ఓటింగ్‌ షేర్‌ 20 నుంచి 13 శాతానికి తగ్గిందని సంజయ్ పేర్కొన్నారు.

 

హైదరాబాద్ లో కర్ణాటక క్యాంపు రాజకీయాలు(Bandi Sanjay)

‘బీజేపీ ని అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే మత రాజకీయాలు చేసింది. ఆ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్‌.. కర్ణాటకలో పెద్దన్న పాత్ర పోషించారు. ఒక వర్గం ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎస్‌డీపీఐ, ఎంఐఎంలు కాంగ్రెస్‌కు సపోర్టు చేశాయి. తెలంగాణలో 5 ఉప ఎన్నికలు జరిగితే 2 సీట్లను బీజేపీ గెలిచింది. మునుగోడులో కూడా మేమే గెలిచినట్టు లెక్క. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ రాలేదు.

అదే విధంగా జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు వచ్చాం. ఒక్క రాష్ట్రంలో గెలిస్తేనే కేంద్రంలో అధికారంలోకి వస్తారా? తెలంగాణలోనూ మా ఓటింగ్‌ శాతం పెరిగింది. కర్ణాటక క్యాంపు రాజకీయాలు .. కేసీఆర్‌ అండతోనే హైదరాబాద్‌లో కూడాపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మోదీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావడం ఖాయం. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్టుగా 4 శాతం రిజర్వేషన్‌ తో పాటు భజరంగ్‌ దళ్‌ను నిషేదిస్తామని తెలంగాణలో చెప్పగలరా? కేసీఆర్‌కు తెలియకుండా హైదరాబాద్‌లో క్యాంపు రాజకీయాలు నడుస్తాయా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని బండి సంజయ్‌ అన్నారు.

 

Exit mobile version