Asifabad: తెలంగాణలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇళ్లలో నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు.
అసిఫాబాద్ సరిహద్దులో కూడా (Asifabad)
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దు పంచుకున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించినట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తరుచూ ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కచ్ జిల్లాలో మరోసారి(Asifabad)
మరో వైపు గుజరాత్ లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. కచ్ లో తేలికపాటి భూ ప్రకంపనలు సంభవించడం సాధారణమే అని అధికారులు తెలిపారు.