TSPSC : నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకే గ్రూప్-1 పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుంది.
ఈ గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేయగా.. 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించగా ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో నేడు మళ్ళీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల కొరకు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో 994 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు సిద్ధం చేశారు.
పేపర్ లీకేజీ నేపథ్యంలో ఈసారి నిబంధనలు మరింత కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు.
ఈ పరీక్షలకు గాను అథారిటీ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను, చీఫ్ కో ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్‌లను ప్రభుత్వం నియమించింది. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 1995 మంది అధికారులు వ్యవహరించనున్నారు. వీరికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేసింది.