Revanth Reddy: సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కేసీఆర్‌కు ఏం అవుతుందనో, మరే ఇతర కారణాల వల్లనో తెలంగాణ ఇవ్వలేదని, తాము ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఇచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఒక వ్యక్తి కాళ్ళ కింద నలిగి పోతోంది ఆవేదన చెందారు. యువకులు ఏం ఆశించి ప్రాణ త్యాగాలు చేశారో ఆ సామాజిక న్యాయం జరగడం లేదని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందని ఆవేదన చెందారు. యువకులంతా ఆలోచించి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల బలిదానాలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చలించిపోయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ ఏర్పడిందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ మొగ్గు చూపారన్నారు.
విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ సాకారమైందని, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల కాదని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిని ప్రజలు కలవలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి విలేకరులతో అన్నారు. గతంలో ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం ఉండేది.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ను కలవలేని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి కూడా రాకూడదని నిర్ణయించుకున్నాడని ఆరోపించారు.
బంగారు తెలంగాణ’ హామీపై మాట్లాడుతూ రేవంత్ రాష్ట్రంలో ఎవరి జీవితాలయినా బాగుపడ్డాయా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులు నేటికీ అష్టకష్టాలు పడుతున్నారని, నేడు మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణపై మీ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను విజయవంతంగా అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.