Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు -చిలకలూరిపేట హైవేపై.. టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో.. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు సమాచారం. బస్సులోని ప్రయాణికులంతా సొంతూళ్లలో ఓటేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. అర్ధరాత్రి 1.30గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు.
బస్సులో 40 మంది ప్రయాణీకులు..(Palnadu)
స్థానికులు, ప్రమాదంలో గాయపడిన వారి వివరాల మేరకు… బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లేటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకర లోడ్ తో ఉన్న టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగాయి. తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి.
20 మందికి గాయాలు..
టిప్పర్ లారీ.. ప్రైవేటు బస్సు వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ .. మరో నలుగురు క్షణాల్లో మంటల్లో కాలిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో అర్ధరాత్రి ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి కూడా 108 వాహనాలను రప్పించారు. బస్సులో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వారిని బయటకు తీశారు. 20మందిని 108 వాహనాల్లో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ రోడ్డుపై మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవయింది. వేగంగా దూసుకువెళ్తున్న టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక.. ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్నట్లు తెలుస్తోంది.
సొంతూరిపై మమకారం… ఓటు వేయాలని దృఢ సంకల్పం.. పిల్లాజెల్లాతో ఇంటిల్లిపాదీ స్వస్థలాలకు వెళ్లిన వారంతా.. హైదరాబాద్ కు తిరిగొస్తూ ప్రమాదానికి లోనయ్యారు. ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్లిన వారంతా బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలోనే మృత్యువు.. టిప్పరు రూపంలో దూసుకొచ్చి.. కళ్లు తెరిచేలోపే.. బస్సు డ్రైవరుతో సహా ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు.. క్షణాల్లో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు మిన్నండంతో ఉలిక్కిపడ్డ స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు.. 108 వాహనాలను.. ఫైరింజన్లను రప్పించారు.