Revanth Reddy Urges PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలత కూడిన వినతిపత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధానిని కోరారు. తెలంగాణకు రావలసిన వనరులు, ప్రాజెక్టులు, ఆర్దికసాయం వివరాలను అందజేసారు.
ప్రధాని మోదీని ఏమడిగారంటే.. (Revanth Reddy Urges PM Modi)
తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు బొగ్గు బ్లాకులను కేటాయించాలిజ
. కేంద్రం వేలం వేయబోయే బొగ్గు గనుల జాబితాలో చేర్చబడిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకును మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ (MMDR) సెక్షన్ 11A/17(A) (2) ప్రకారం సింగరేణికి కేటాయించాలి. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి గోదావరి లోయ కోల్ ఫీల్డ్‌లోని కోయగూడెం బ్లాక్ 3 మరియు సత్తుపల్లి బ్లాక్ 3 గనులను కూడా సింగరేణికి కేటాయించాలి.
తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న భూమి లేదా ప్రత్యామ్నాయ స్థలాన్ని అందించాలి.. హైదరాబాద్ మరియు బెంగళూరుకు 2010లో మంజూరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలి. 2014లో ప్రభుత్వంలో మార్పు రావడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని, కొత్త ఐటీ కంపెనీలు, డెవలపర్‌లను ప్రోత్సహించేందుకు దీన్ని పునరుద్ధరించాలని అభ్యర్థించారు.
కాజీపేటలో సమీకృత రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఇది 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చేసిన వాగ్దానమని గుర్తు చేసారు.
హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంటూ, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలని కోరారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బిఆర్‌జిఎఫ్) కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లను విడుదల చేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్-కరీంనగర్ రోడ్డు, హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి (NH 44)లో ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నిర్మాణాలను సులభతరం చేసేందుకు రక్షణ శాఖ ఆధ్వర్యంలోని భూములను బదలాయించాలని కోరారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే సమర్పించిన సాధ్యాసాధ్యాల నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డులోని దక్షిణ భాగాన్ని భారతమాల ప్రాజెక్టులో చేర్చాలని కోరారు. పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 12 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.