Site icon Prime9

Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు బ్రేక్.. రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy:  రైతుబంధు నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని పది రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ అడ్డుకుంది..(Revanth Reddy)

ఇలాఉండగా రైతుబంధు విషయంలో ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని తాను చెబితే దానికి వక్రభాష్యాలు చెప్పి కాంగ్రెస్ నిధులు జమ కాకుండా అడ్డుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు మాట్లాడారు. రైతు బంధు రాకుండా అడ్డుపడ్డ కాంగ్రెస్‌ని ఓడించి బుద్ధి చెప్పాలని హరీష్ రావు రైతులని కోరారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి వచ్చేది తామేనని ఎన్నికలు కాగానే రైతుబంధు డబ్బులు విడుదల చేస్తామని హరీష్ రావు ప్రకటించారు.

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా, పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలను ఆపుచేయాలని సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version