Hyderabad: అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి సెటిల్ మెంట్లతో ఏకంగా రూ.200 కోట్లు సంపాదించినట్టు నిర్ధారించారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే ఫామ్ హౌస్ కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని, నాగేశ్వర రావు బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
బాధితురాలికి కోవిడ్ పాజిటివ్ రావడంతో నాగేశ్వర రావుకు కరోనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచార కేసులోంచి నిందితున్ని తప్పించడానికి ఓ మీడియా ప్రతినిధి ప్రయత్నించినట్టు గుర్తించారు. ఈ కేసులో మీడియా ప్రతినిధి పాత్రపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం నిందితున్ని రిమాండ్ కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.