Ramoji Rao: తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థకు గురికావడంతో.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిన్నిటి నుంచి చికిత్స పొందుతూ.. మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు.
అక్షర యోధుడు..( Ramoji Rao)
రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం తెలిపుతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి, ఈటల సహా పలువురు సంతాపం తెలిపారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని.. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని.. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని.. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు అన్నారు. మీడియా రంగంలో రామోజీ ప్రత్యేకమైన శకమని.. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చంద్రబాబు అన్నారు.
మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమైనవని.. రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురి చేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపుతున్నామన్నారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని చిరంజీవి అన్నారు. ఓం శాంతి అంటూ Xలో చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు.. శక్తివంతమైన వ్యవస్థ అని.. రామోజీరావు లేని లోటు తీర్చలేనిదని వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా ఆప్తమిత్రుడిని కోల్పోయానని.. పత్రికా రంగం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగు చరిత్రలో రామోజీరావు అంతర్భాగమని చెప్పారు. రామోజీ రావు అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
2016లో పద్మ విభూషణ్..
చెరుకూరి రామోజీ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు . రామోజీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలలో మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్ , రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్, హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్ , మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. రామోజీ రావుతెలుగు సినిమాలో తన రచనలకు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ , ఐదు నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డులు దక్కించుకున్నారు. 2016లో, జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన చేసిన సేవలకు గానూ, భారతదేశం రెండవ-అత్యున్నత పౌర గౌరవమైన పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.