Congress party meeting: నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.
ఇలాఉండగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. . ఖమ్మం సభకు వెళ్లే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జూలూరుపాడు, సుజాతనగర్లో చెక్‌పోస్టులు పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను నిలిపివేస్తు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జనం తరలివస్తారని తెలిపారు. ఎంత కట్టడి చేసినా జనాన్ని ఆపలేరన్నారు. ఎలాగైనా సభను విజయవంతం చేసి తీరుతామని ఆమన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సభకు వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకుంటున్న విషయంపై డిజిపితో మాట్లాడారు రేవంత్ రెడ్డి. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై రేవంత్, మధుయాష్క డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు. సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని కోరారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని రేవంత్ స్పష్టం చేశారు.
ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను కాంగ్రెస్ తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సభకు తెలంగాణ జనగర్జన అనే పేరు పెట్టగా, ప్రజల్లోకి ఇదే నినాదంతో వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.