Rahul and Priyanka: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సుయాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతల బస్సు యాత్రల పై చర్చించనున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక గాంధీతో ప్రారంభించనున్నారు. ఈ నెల 15, 16 న ప్రియాంక గాంధీ బస్ యాత్ర, ఈ నెల 18, 19 న రాహుల్ గాంధీ బస్ యాత్రలు ఇప్పటికే ఖరారయ్యాయి. అగ్ర నేతల ప్రచార రూట్ మ్యాప్ పై కూడా పీఏసీ సమావేశం చర్చించనుంది. పీఏసీ సమావేశంలో ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రె, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు 22 మంది ముఖ్య నాయకులు పాల్గొంటారు. బస్సు యాత్రకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను టీపీసీసీ ఏఐసీసీ ఆమోదం కోసం సమర్పించిందని తెలిసింది. ఇందులో నియోజకవర్గానికి సంబంధించిన నిర్దిష్ట సమస్యలను వీధి కార్నర్ మరియు రోడ్‌సైడ్ సమావేశాల ప్రణాళికతో సహా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేస్తామన్న ‘ఆరు హామీలు’ మరియు ‘ప్రకటనల’ గురించి ప్రచారం చేయడంతో పాటు, కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్యతను ప్రదర్శించడం ఈ యాత్రల ప్రధాన లక్ష్యం.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. అధిష్టానం తీసుకునే నిర్ణయంకోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి నివేదికను ఢిల్లీ తీసుకొచ్చిన రాష్ట్ర నాయకత్వం, 119 నియోజకవర్గాలకు దాదాపు 300 పేర్లను జతచేసింది. తెలంగాణ ఓబీసీ నాయకులు, కమ్మఐక్య వేదిక నాయకులు తమకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలను కలిశారు.