Ponguleti Srinivasa Reddy:మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. పొద్దుగూకాక ఏగూటికి చేరాల్సిన పక్షులు ఆ గూటికే చేరుతాయి కదా… అలాగే తమ పార్టీపై నమ్మకంతో ప్రజా ప్రతినిధులు చేరుతున్నారని ఆయన అన్నారు. ఎవరు కరటక దమనకులో అతి త్వరలో తెలుస్తుందన్నారు. మీ పద్దతి మార్చుకోండి.. లేకపోతే డిసెంబర్ 30 తర్వాత మీపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ లో చేరితే ఇబ్బందులు ఎదురవుతాయని తనకు ముందే తెలుసని పొంగులేటి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసినప్పటికీ కేంద్రం స్పందించలేదన్నారు. దీనిపై కేంద్ర జలవనరుల సంఘం కూడా తప్పు పట్టినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.