BJP MLA Raghunandan Rao: తనకి పదవులు కావాలంటూ ఇంతకాలం పార్టీ అధిష్టానం దగ్గర విన్నపాలు వినిపించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పుడు జోరు పెంచారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ రావు ఇంకో అడుగు ముందుకేశారు. వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేకపోయామని, అదే వంద కోట్లు తనకిస్తే తెలంగాణని దున్నేసేవాడినని రఘునందన్ రావు చెప్పారు. కెసిఆర్‌ని కొట్టే మొగోడు తానేనని నమ్మి దుబ్బాకలో ప్రజలు తనని గెలిపించారని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. బీజేపీని చూసి ఓట్లేయలేదని రఘునందన్ అన్నారు. తనకంటే ముందు బీజేపీ పోటీ చేస్తే దుబ్బాకలో వచ్చింది మూడు వేల ఐదు వందల ఓట్లేనని రఘునందన్ రావు గుర్తు చేశారు.
పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్‌కి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకీ వాటా ఉందని రఘునందన్ చెప్పారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలు పెడితే ఓట్లు రాలవని, రఘునందన్ రావు, ఈటల బొమ్మలుంటేనే ఓట్లు వేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ గుర్తన్నది చివరి అంశమని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పార్టీకి శాసన సభాపక్ష నేత లేడనే విషయం నడ్డాకు తెలియదని రఘునందన్ రావు చెప్పారు.
నేను గెలిచాననే ఈటల పార్టీలోకి వచ్చారు..(BJP MLA Raghunandan Rao)
తాను గెలిచినందుకే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారని రఘునందన్ అన్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవినుంచి తప్పిస్తున్నారని మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే అని రఘునందన్ తెలిపారు. పదేళ్ళలో పార్టీకోసం తనకంటే ఎవరూ ఎక్కువ కష్టపడలేదని రఘునందన్ రావు చెప్పారు. సేవకి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే పార్టీ అధ్యక్షుడు నడ్డాపై ప్రధాని మోదీ వద్ద కేసు వేస్తానని రఘునందన్ రావు చెప్పారు.