Pawan Kalyan Questions:జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తోటపల్లి ఎడమకాలువ పనులు చేయలేదు.. జంపరకోట పనులు చేయలేదు.. రెండూ కలిసి 216 కోట్లు. రైతు కన్నీరు తుడిస్తేనే కదా మనం అన్నం తినగలం. మరి ఈ డబ్బులు ఏం చేసారు. రంగులు మార్చడానికి మాత్రం రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసారు అంటూ మండిపడ్డారు.
సిక్కోలు యువత, ఉత్తరాంధ్ర యువత అగ్నిజ్వాలలతో భగభగమండే యువత. 1960లో బామిని మండలంలో వైఎస్ జగన్ లాంటి దోపిడీ దారులమీదే ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది. అటువంటి రోజులు మళ్లీ వస్తాయని జగన్ కు చెప్పండని పవన్ అన్నారు. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. గ్రామం సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే..కుటుంబానికి రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తుంది.మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుంది.సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తాం. వృద్ధాప్య పింఛను రూ.4వేలు ఇస్తాం. ప్రతి చేనుకు నీరు..ప్రతి చేతికి పని కల్పిస్తాం.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని పవన్ చెప్పారు. కేంద్రప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఇచ్చే ట్రైకార్ రుణాలు సీఎం జగన్ వచ్చిన తరువాత అందడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన యువతకు ట్రైకార్ రుణాలు ఇప్పించడానికి కొత్తపల్లి గీతతో కలిసి తాను కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.జగన్ ఒక్క ఛాన్స్ అని అడిగారు..మీరు ఇచ్చారు..ఇక వైసీపీని ఇంటికి పంపండని అన్నారు.నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా..నేను పనిచేస్తా..నేతల చేత పనిచేయిస్తా ..పాలకొండను బంగారు కొండలా చేసుకుందామని పవన్ పేర్కొన్నారు.