Site icon Prime9

Pawan Kalyan: మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్, లేనపుడు మరో రూలా?- జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

Pavan Kalyan

Pavan Kalyan

Pawan Kalyan: ఏపీలో విపక్ష నేతలు రోడ్‌‍షోలు, ర్యాలీలు చేయకుండా వైకాపా ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఓదార్పు యాత్ర పేరుతో దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్‍ షోలు చేయొచ్చు కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల్లో ప్రజల్లో తిరగడానికి అనుతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనపుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని నిలదీశారు.ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

ఇలాంటి చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరు నెలలోనే వెల్లడించారని తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, హోటల్‌ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారని తెలిపారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారని.. ఆ పోకడలనే అక్షరాల్లో ఉంచి ఇప్పుడు జీవో ఇచ్చారని చెప్పారు. ఈ ఉత్తర్వుల బూచి చూపి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు.

ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి అన్నారు. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా అని నిలదీశారు. ఈ ఉత్తర్వులు సీఎం జగన్‌కు కూడా వర్తిస్తాయా అని ప్రశ్నించారు. మంగళవారం రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి చేసిన షో.. ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయో.. రావో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకొస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నించాలని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Exit mobile version