Site icon Prime9

Hyderabad Traffic: నేటినుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్

New traffic rules

New traffic rules

Hyderabad New Traffic Rules: ట్రాఫిక్స్ రూల్స్‌ను అతిక్రమించేవారికి ఇక నుంచి భారీగా ఫైన్లు పడనున్నాయి. నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ రానున్నాయి. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రోప్ పేరుతో పోలీసులు కొత్త డ్రైవ్ చేపట్టనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగిస్తే భారీగా ఫైన్ వేయనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాలను రిలీజ్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ 600 ఫైన్ విధించనున్నారు. సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ దాటితే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే వంద రూపాయల జరిమానా విధిస్తారు. ఇకపై ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసే వాహనదారులకు వెయ్యి ఫైన్ పడనుంది. ఫుట్‌పాత్‌లపై ఎవరైనా దుకాణదారులు వస్తువులు పెడితే వారికి కూడా ఇక నుంచి భారీ జరిమానా తప్పదు. ఫుట్ పాత్‌లను ఆక్రమిస్తున్న దుకాణాదారులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేపట్టారు. ఇక రెడ్ సిగ్నల్ దగ్గర అడ్డదిట్టంగా వాహనాలను నిలిపేవారిపై కూడా దృష్టిపెట్టారు పోలీసులు.ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు సీన్‌లోకి దిగిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ కొత్త యాక్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే 100 రూపాయల, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే 1,000 రూపాయల జరిమానా విధించనున్నారు.

నగరంలో రహదారులపై ప్రతిరోజు దాదాపు 80లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. 2019తో పోలిస్తే వాహనాలు ఏకంగా 18శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాలే దాదాపు 56లక్షల వరకు ఉన్నాయి. దాదాపు 14లక్షల కార్లు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే కొన్ని మార్గాల్లో కిలోమీటరు ప్రయాణానికి 10 నిమిషాల సమయం పడుతోంది. ఒక్కోసారి గంటల తరబడి రహదారులపైనే వాహనదారులు నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో చేతులెత్తేస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడమే ట్రాఫిక్ సమస్యలకు కారణమని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. ఇక ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రెండు టోయింగ్‌ క్రేన్‌లు ఏర్పాటు చేస్తున్నామని, పార్కింగ్‌ సౌకర్యం లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు సీపీ ఆనంద్‌.

ఆర్టీసీ బస్సులు బస్ బే లలోనే నిలిపేటట్లుగా, ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సీపీ ఆనంద్ సూచించారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు.. రహదారులు, ఫుట్ పాత్‌ల పైకి రాకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించనున్నారు. జీఓ 168 ప్రకారం బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, విద్యా సంస్థల్లో 30శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్ లు, వాణిజ్య భవనాల్లో 40శాతం, షాపింగ్ మాల్స్‌, మల్టిప్లెక్స్‌లలో 60శాతం పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయని భవనాలపై చర్యలు తీసుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ముందుకు వెళ్లనున్నారు.

Exit mobile version