Chandrababu Naidu:ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇక చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌కళ్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
చంద్రబాబు పేరును ప్రతిపాదించిన పవన్ (Chandrababu Naidu)
గత ఐదేళ్లుగా ఏపీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. ఈ సందర్భంలో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం చంద్రబాబు, పవన్ ఆత్మీయ ఆలింగరం చేసుకున్నారు. అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందని పవన్ తెలిపారు. ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామని గుర్తుచేశారు. ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని.. ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని పవన్ చెప్పారు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా సీఎం అభ్యర్ధిగా చంద్రాబాబు పేరును బలపరిచారు. గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని పురందేశ్వరి తెలిపారు. ఐదేళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ఐదేళ్లలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారన్నారు. ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించారని అందుకే బంపర్ మెజార్టీతో కూటమిని గెలిపించారని చెప్పారు. సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేస్తున్న చంద్రబాబుకు పురందేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ ను మరిచిపోలేను..
ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలిచ్చారని.. వాళ్లు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని కొనియాడారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారన్నారు. అందరం సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే బాధ్యతపై మనపై ఉందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని చంద్రబాబు చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని గుర్తుచేశారు. పవన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.