Nara Lokesh: తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేష్ … ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలలో పర్యటించనున్నారు . ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు.
తెలుగుదేశం శ్రేణులు ఎన్నికలకు సిద్ధమయ్యేలా యువగళం మొదటి యాత్ర వారిలో ఉత్తేజం నింపిందని తెలుగు దేశం పెద్దలు భావిస్తున్నారు .అందుకే మరోసారి ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతు కోసం లోకేష్ ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు విరామం లేకుండా కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా…లోకేష్ కేవలం తన నియోజకవర్గం మంగళగిరి కే పరిమితమయ్యారు. అపార్ట్‌మెంట్ వాసులను కలిసి ఓట్లు అభ్యర్థించడంతోపాటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. ఆయన భార్య బ్రాహ్మణి సైతం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే గతంలో లోకేష్ పాదయాత్ర చేయని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తిరిగి ఆయా ప్రాంతాల్లో మరోసారి లోకేష్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి యువగళం యాత్రలో పాల్గొననున్నారు. ఏప్రిల్ ౩౦ న ఒంగోలు నుంచి యువగళం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా మే 6 వరకు లోకేష్ పర్యటనలు సాగనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, మే 4 నంద్యాల, 5 వ తేదీ చిత్తూరు, 6 వ తేదీ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు.గతంలో లోకేష్ పాదయాత్ర ద్వారా యాత్ర నిర్వహించారు ఇప్పుడు పాదయాత్ర కన్నా బహిరంగ సభలకు పరిమితమవనున్నారని తెలుస్తోంది .లోకేష్ యాత్రతో మరోసారి టీడీపీ యువత లో ఉత్సాహం రానుందని టీడీపీ పెద్దలు చెబుతున్నారు .