Nara Lokesh: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ సందర్బంగా పలు కీలక అంశాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. కాసేపట్లో జరగబోయే జనసేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో చర్చించబోయే అంశాలని చంద్రబాబుకి లోకేష్ వివరించారు.
పలు అంశాలపై చర్చ.. (Nara Lokesh)
విద్యుత్ చార్జీల పెంపు, కృష్ణా జలాల పంపిణీ, క్షేత్రస్థాయి వరకూ జనసేన- టిడిపి కమిటీల ఏర్పాటుపై చంద్రబాబుతో లోకేష్ చర్చించారు. నారా భువనేశ్వరి చేపట్టబోయే యాత్రపైన కూడా సమాలోచనలు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు లోకేష్ కు పలు సూచనలు చేసారు. చంద్రబాబుతో ములాఖత్ తరువాత నారా లోకేష్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అచ్చెన్నాయుడు, నిమ్మల, యనమల, పయ్యావులతో జనసేన- టిడిపి భేటీపై నారా లోకేష్ చర్చించారు. ఈ సాయంత్రం నారా భువనేశ్వరి తిరుపతికి బయలుదేరి వెళ్ళనున్నారు. రేపు తిరుపతిలోనే బస చేస్తారు. శ్రీవారిని దర్శించుకుంటారు. ఎల్లుండి నారావారిపల్లెనుంచి నిజం గెలవాలి బస్సు యాత్రని నారా భువనేశ్వరి మొదలుపెడతారు.
ఇలాఉండగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేశామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజమండ్రిలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో మంచి ప్రభుత్వాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు స్వార్ధం కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో కాదు.. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు అంతా కలసి రావాలని పిలుపునిచ్చారు.