Pawan Kalyan- Balashowry: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్‌తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్‌తో చర్చించారు.
త్వరలో సీటుపై క్లారిటీ..(Pawan Kalyan- Balashowry)
బాలశౌరి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా చేసిన రోజునే ఆయన తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసారు. గత కొంతకాలంగా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని, బాలశౌరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో మచిలీపట్నంలో బాలశౌరి పర్యటనను పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం కూడా జరిగింది. ఇంత జరిగినా వైఎస్సార్ సీపీ పెద్దలు వీరి మధ్య సయోధ్యను కుదర్చలేకపోయారు. మరోవైపు మచిలీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్దమయింది. సీఎం జగన్ అతని పేరును ఖరారు చేసేసారు. అయితే మచిలీపట్నం ఎంపీ స్దానానికి అభ్యర్దిని మార్చాలని నిర్ణయించారు. దీనితో బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేన తరపున తాను ఎంపీగా పోటీ చేసే సీటుపైన కూడా ఆయన పవన్ తో చర్చించినట్లు సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం, గుంటూరు.. ఈ రెండింటిలో ఎక్కడనుంచి పోటీ చేస్తారన్నదానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బాలశౌరి 2004లో తెనాలినుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009లో నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గుంటూరు నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.