Megastar Chiranjeevi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడని తెలిపారు.
ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు..(Megastar Chiranjeevi)
తన గురించి కంటే.. ప్రజల గురించి పవన్ ఎక్కువ ఆలోచిస్తారన్నారు. పవన్ కళ్యాణ్.. సినిమాల్లోకి బలవంతంగా.. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడని తెలిపారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్… తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం… ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది. అధికారం లేకపోయినా సొంత డబ్బులను కౌలు రైతులకు, మత్స్యకారులకు పంచిన గొప్ప వ్యక్తి పవన్ అని కొనియడారు. పవన్ అనవసరంగా మాటలు పడుతుంటే అన్నగా తనకు బాధగా ఉందన్నారు.అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్ట సభలో పవన్ కళ్యాణ్ ఉండాలన్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలని.. గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.