AP Assigned Lands Case: ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలని సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది.
ఈ కొత్త ఆధారాల నేపథ్యంలో కేసుని రీ ఓపెన్ చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రతివాదులకి సూచించింది. తమ అభ్యంతరాలని కౌంటర్ దాఖలు చేస్తామని మాజీ మంత్రి నారాయణ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకి తెలిపారు. దీంతో విచారణని నవంబర్ ఒకటవ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఇప్పటికే హైకోర్టులో విచారణ ముగియగా.. నేడు తీర్పు రావలసి ఉంది. కేసు రీ ఓపెన్ చేయాలని సీఐడీ రెండు పిటిషన్లు వేసింది.
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్లడ్డారని చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. నేడు మరోసారి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు.