Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లూటీ చేసిన డబ్బంతా కక్కిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.ఈ అవినీతి వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మహాలక్ష్మి పథకం (పేద కుటుంబాల మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం), ఉచిత బస్సు రవాణా మరియు సబ్సిడీ సిలిండర్ పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ దోచుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ కార్యక్రమాలు మహిళలకు నెలకు సుమారు రూ. 4,000 వరకూ లబ్ది చేకూర్చగలవని చెప్పారు.ఎన్నికల పోరు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య ఉంది. ఏఐఎంఐఎం, బీజేపీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన రాహుల్..(Rahul Gandhi)
అంతకుముందు రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డను పరిశీలించారు రాహుల్. రాహుల్ గాంధీ వెంట రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు ఉన్నారు. మేడిగడ్డకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మేడిగడ్డ దారులు అన్నింటి పోలీసులు మూసేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. అనుమతించడం కుదరదని పోలీసులు చెప్పారు. కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.