JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మినారాయణ తన ప్రాణానికి ప్రమాదం ఉందని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాజా ఎన్నికల్లో జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.జేడీ లక్ష్మినారాయణ అసలు పేరు వాసగిరి వెంకట లక్ష్మినారాయణ కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వున్నప్పుడు జగన్ ను ,గాలి జనార్దన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం తో తన హోదా తో జేడీ లక్ష్మినారాయణ అనే పేరు బాగా పాపులర్ అయింది.
అనుమానం ఎవరి పైన ?.. (JD Lakshminarayana)
జేడీ లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .గతంలో అక్రమ మైనింగ్ కేసు లో గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు తనను హత్య చేసేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని జేడీ లక్ష్మినారాయణ తన ఫిర్యాదు పత్రంలో తెలిపారని సమాచారం . మైనింగ్ కేసుతో పాటు బెయిల్ కోసం జడ్జికి లంచం ఇచ్చిన కేసులోనూ జనార్ధన్ రెడ్డిని వీవీ లక్ష్మినారాయణ విధుల్లో ఉన్నప్పుడు అరెస్టు చేశారు. ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి తన హత్యకు కుట్ర చేస్తున్నట్లుగా వీవీ లక్ష్మినారాయణకు స్పష్టమైన సమాచారం వచ్చి ఉంటుందని అందుకే ఫిర్యాదు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ .ఎన్నికల అనంతరం జనసేన పార్టీ ని వీడారు .ప్రస్తుతం భై భారత్ నేషనల్ పార్టీ స్థాపించి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ సారి విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే గా బరిలోకి దిగుతున్నారు . ఈ క్రమంలో తనపై దాడి జరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు. సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందచేసినట్లు తెలుస్తోంది .