Pawan Kalyan Comments: తాను చేయలేని పాదయాత్ర నారా లోకేష్ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర వలన ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసే అవకాశం లభిస్తుందన్నారు. లోకేష్ యాత్ర జగన్ యాత్ర లాగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని ప్రజలతో మమేకమైన యాత్రని అన్నారు.
ఎమ్మెల్యేలను కాదు జగన్ ను మార్చాలి..( Pawan Kalyan Comments)
మనిషి కష్టాల్లో ఉన్నపుడు నా వంతు సాయం ఉండాలనే నేను రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు గారిని కలిసాను. ఒకప్పుడు కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు. రాజధాని లేకుండా విభజన జరిగింది. ఒక దశాబ్దం పాటు పార్టీని నడపాలంటే చాలా అనుభవం కావాలి. అందుకే ఆ రోజు టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికాను. 2019లో దురదృష్టవ శాత్తు దానిని ముందుకు తీసుకు వెళ్లలేకపోయాము. దానిఫలితమే ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని విన్నాను. కాని మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు జగన్ ను మార్చాలి. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో వైఎస్సార్ తో సహా ఎవరూ ఇంట్లో మహిళలను నీచంగా మాట్లాడలేదు. ఇటువంటి సంస్కృతి జగన్ హయాంలో మొదలయింది. దీనికి ముగింపు పలకాలి. ఏపీలో జనసేన- టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ అన్నారు.
మరొక్కసారి వైసీపీకి అధికారం వస్తే..
ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వనివాడు మిగతావారికి ఎలా ఇస్తాడు? ఒక్క ఏడాదిలో ఏపీలో పదివేలమంది మహిళలు అదృశ్యమయ్యారు. వాలంటీర్లు ఒంటరి మహిళల డేటాను సేకరిస్తున్నారని నాకు కొంతమంది చెప్పారు. యువవతకు ఉద్యోగాలు వస్తే ఆనందమే. కాని కొంతమంది వాలంటీర్లు వలన మహిళలు అన్యాయానికి గురవుతున్నారని పవన్ అన్నారు. మరొక్కసారి వైసీపీకి అధికారం వస్తే ఏపీలో ఎవరూ ఉండలేరు. ప్రతీ కొండనూ, కోననూ దోచేస్తారు. యువత భవిష్యత్తు, మహిళల భద్రత దృష్టిలో పెట్టుకుని ఓటు చీలకూడదని నిర్ణయం తీసుకున్నాను.ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు కూడా తెలియజేసాను. మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో రోడ్లమీద వైపీపీ గూండాలతో రోడ్లమీద కత్తులతో పోరాడవలసి వస్తుందని అన్నారు. అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని రంగాలకు ఏమి చేయాలనే దానిపై సమగ్రంగా చర్చించి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తాము. నేను మాటకు, మైత్రికి చాలా విలువ ఇస్తాను. టీడీపీ అధినాయకుడు, కార్యకర్తలు కొండంత కష్టంలో ఉన్నపుడు అర్దం చేసుకున్నాను. వ్యక్తి, వర్గ, పార్టీ ప్రయోజనాలు అన్నీ దాటి మీకు అండగా నిలబడ్డాను. ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు కలిసి ముందుకు రావాలన్నదే నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.