Pawan Kalyan: విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుచరులు న్యాయపోరాటాలను తట్టుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అందుకే మూర్తి యాదవ్ కు ప్రాణహాని తలపెట్టారని అన్నారు.విశాఖలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్ నిర్మించడం, దసపల్లా భూముల వ్యవహారం, టీడీఆర్ స్కామ్, టైకూన్ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలను నిర్మించడం లాంటి వైసీపీ నేతల అక్రమాలపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారని చెప్పారు, జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారు.అందుకే వైసీపీ నేతలు ఆయనపై కక్ష గట్టారు. మూర్తి యాదవ్ కు అండగా జనసేన పార్టీ నిలుస్తుంది. అతనికి ప్రాణహాని తలపెట్టిన వారిపై తక్షణమే పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, విశాఖ నగర పోలీసు కమీషనర్ కు విజ్జప్తి చేస్తున్నాం. ఆయనకు ఏ చిన్నపాటి హాని కలిగించినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.