IT Raids: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో నేటి ఉదయంనుంచి ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
దాడుల్లో 70 ఆదాయపు పన్ను బృందాలు..( IT Raids)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు రిటర్న్స్ పత్రాలని పరిశీలిస్తున్నారు. 70 ఆదాయపు పన్ను బృందాలు ఏకకాలంలో బెంగళూరు, హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో దాడులు ప్రారంభించాయి. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి, భవనగిరి ఎమ్మెల్యే పీ శేఖర్ రెడ్డి నివాసాలపై సోదాలు జరిగాయి.
శేఖర్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. శేఖర్ రెడ్డి హతమైన గ్యాంగ్‌స్టర్ మహ్మద్ నయీం బినామీ అని కూడా వార్తలు వచ్చాయి. ఆదాయ వనరులు, ముఖ్యంగా స్థిరాస్తుల వివరాలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.మరో ఘటనలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసం, ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అతను నగరంలో ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి తన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో పన్ను ఎగవేసినట్లు అనుమానం వచ్చింది.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి నివాసంతోపాటు మహబూబ్‌నగర్‌లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.