Site icon Prime9

High Court New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం.. మరో ఏడు రాష్ట్రాలకు కూడా !

High Court New Judges for ap and telangana

High Court New Judges for ap and telangana

High Courts New Judges : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం ఖరారైంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో రాష్ట్రంలో ఖాళీ ఏర్పడింది. దాంతో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. మరోవైపు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను సిఫార్సు చేసింది. గుజరాత్‌కు మహిళా న్యాయమూర్తి సునీతా అగర్వాల్, బాంబేకి దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, మణిపూర్‌కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్రల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ పేరును బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జీ సునీతా అగర్వాల్ పేరును గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది.

Exit mobile version