BRS MLC viṭhal: ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022లో జరిగిన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దండె విఠల్ గెలుపొందారు.
ఫోర్జరీ సంతకాలంటూ ఆరోపణ..(BRS MLC viṭhal)
విఠల్ మోసపూరితంగా గెలిచారంటూ సారంగపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తి రాజశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి దండే విట్టల్ కు ఓటు పడేలా చేశారని హైకోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కోరారు. కేసు విచారించిన హైకోర్టు దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసింది. అంతేకాదు 50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.