Janasena chief Pawan Kalyan: సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.
అమ్మానాన్న లేని ఆ బాలిక తన తమ్ముడితో కలసి జీవిస్తుంటే.. నలుగురు మృగాళ్ళు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చ అని పవన్ మండిపడ్డారు. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి గంజాయి మత్తులో తూగుతూ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాల్ని సంరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో.. గంజాయి ముఠాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నామని చెప్పారు. ఈ నగరానికీ, తెలంగాణకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో కూడా పత్రిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయని.. గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాల్సిన అవసరం ఉందని అన్నారు.. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయగలమని పవన్ కళ్యాణ్ చెప్పారు.