Former MP Undavalli Comments: ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచిన సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ రాజకీయ వేత్త ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థితి మాత్రం దశాబ్ది ఘోష అన్నట్లు తయారయ్యిందని వ్యాఖ్యానించారు . 2014 నుండి 2024 వరకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ఇప్పటి జగన్, నాటి చంద్రబాబు ప్రభుత్వాలే కారణమని ఉండవల్లి అరుణ్ కుమార్ దుయ్యబట్టారు . రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని అందరికి తెలిసినా , విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఈరోజుకి కూడా అమలు చేయలేదని తెలిపారు .
విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ఇంకా పూర్తీ కాలేదని , రైల్వే జోన్ త్రిశంకు స్వర్గంలోవుందని అన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పోలవరం 48శాతమే పూర్తయ్యిందని తెలిపిందని అన్నారు. ఇంకా 52శాతం పూర్తీ కావాల్సి ఉందని చెపాప్రు . 2014 లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేశామని, రూ . 500కోట్లు ఇస్తే సరిపోతుందని కేంద్ర పెద్దలు అంటున్నారని అన్నారు. రూ . 500 కోట్లతో పోలవరం మిగిలిన పని ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు . విభజన తర్వాత పదేళ్లు ఏపీకి ఇబ్బందిగానే సాగిందని , ఏపీలో రాజకీయంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టే బీజేపీ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత ఏర్పడే ప్రభుత్వమైనా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, లేకపోతే రాష్ట్రం మరింత ఇబ్బంది పడుతుందని అన్నారు ఉండవల్లి.