Nadendla Manohar: మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
అయితా నగరం, చక్రాయిపాలెం, బుర్రిపాలెం, చదలవాడ, చెముడుపాడు తదితర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతు కష్టాల్లో ఉన్నాడని ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేయడం కాదు. రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. తూతూ మంత్రంగా రూ.2 కోట్లు పరిహారం ఇస్తే అది దేనికి సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. బాపట్ల,గుంటూరు జిల్లాల్లో రూ.1800 కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని ఇది కేవలం ప్రాధమిక అంచనా మాత్రమే అని అన్నారు. నాలుగేళ్లుగా కాలువలు మరమ్మతు చేయకుండా వదిలేసారని దానివల్లే ప్రస్తుతం ఇంత నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులవద్ద ప్రతిగింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేసేవరకూ జనసేన-టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. పండిన పంటను ఎట్టి పరిస్దితుల్లోనూ కొనుగోలు చేయవలసిందేనని మనోహర్ స్పష్టం చేసారు.