Janasena chief Pawan Kalyan: భీమవరంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్ పై వైసీపీ నాయకుడైన ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. పూజారులపై దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలకవర్గం అహంభావానికీ ప్రతీక అని పవన్ అన్నారు. ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైదిక ఆచారాల్లో యజ్జోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాం. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడిచేయడం, వారిని ఇబ్బంది పెట్టడం రాక్షసత్వమే. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగాణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్దంలేని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారు. వైసీపీ సర్కార్ హిందూ దేవాలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించే క్రమంలోనే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది. ఇది స్దానిక వైసీపీ నాయకుడు చేసిన దాడిగా సరిపుచ్చలేం. యధా నాయకుడు తధా అనుచరుడు అనే విధంగా తయారయ్యారు వైసీపీ నాయకులు. ఎవరి కళ్లల్లో ఆనందం కోసం అర్చకుడిపై దాడిచేసి పవిత్ర యజ్జోపవీతాన్ని తెంచేసారో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఈశ్వరుని సన్నిధిలో దాడిచేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.