Etela Rajender: మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆయన ప్రమాణం చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.
ఒట్టేసే అవసరం నాకు లేదు( Etela Rajender)
‘ నేను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. ఆత్మ సాక్షిగానే మాట్లాడా.నేను ఎవరినీ గాయపరిచే వ్యక్తిని కాదు. వ్యక్తుల కోసం మాట్లాడలేదు. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడతా.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం నాకు లేదు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని నేను పాటించడం లేదు. ఈ విషయంపై తగిన సమయంలో జవాబిస్తా. ఇపుడున్న రాజకీయాలపై మాట్లాడా. కేసీఆర్ కు వ్యతిరేకంగా రేవంత్ పోరాడటం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్దం ఏంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా? ’ అంటూ ఈటల బదులిచ్చారు.
రాజీ నా రక్తంలో లేదు: రేవంత్ రెడ్డి( Etela Rajender)
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు కోపం కేసీఆర్ డబ్బులు పంచారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ ప్రమాణం చేశారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ పడటం నా రక్తంలోనే లేదు. చివరి శ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదు. ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసు.
బీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులతో బరిలోకి దిగాయని, కానీ కాంగ్రెస్ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపింది. మునుగోడు ఉపఎన్నిక కోసం ఆ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ. 25 కోట్లు తీసుకున్నారని విమర్శించారు. నా నిజాయితీని అనుమానిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్ సర్వమంతా దారబోసినా రేవంత్ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు. భయం నా ఒంట్లో లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.