ECI Bars KCR: కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా భారత ఎన్నికల సంఘం నిషేధించింది.
కేసీఆర్ బుధవారం రాత్రి రోడ్‌షోలో పాల్గొనడానికి కొత్తగూడెం నుండి మహబూబాబాద్‌కు వెళుతుండగా, ఎన్నినకల కమీషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో రాత్రి 8 గంటలకు తన సమావేశాన్ని ముగించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, షోలు, ఇంటర్వ్యూలు, మీడియాలో బహిరంగ ప్రకటనలు నిర్వహించకుండా ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్‌పై అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌రావుకు కమిషన్ గతంలో నోటీసులు జారీ చేసింది.
నా మాటలు వక్రీకరించారు..(ECI Bars KCR )
మరోవైపు తాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలకే పరిమితమయ్యానని, ఏ కాంగ్రెస్ నేతల వ్యక్తిగత అంశాలను విమర్శించలేదని కేసీఆర్ సమాధానమిచ్చారు.తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న అధికారులు తెలుగు వారు కాదని, తెలుగు స్థానిక మాండలికాలు అర్థం కావడం లేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కొన్ని వాక్యాలను ఎంచుకుని ఫిర్యాదు చేసింది. వాక్యాల ఆంగ్ల అనువాదం సరిగ్గా లేదని వక్రీకరించబడ్డాయని కేసీఆర్ చెప్పారు. మే 2019లో కరీంనగర్ మరియు 2023 అక్టోబర్‌లో బాన్సువాడలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా కేసీఆర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘించారని ఎన్నికల కమీషన్ గతంలో పేర్కొన్న సందర్భాలను ఉదహరించింది.
కేసీఆర్ ను చూసి వణుకుతున్నారు..
ఇలాఉండగా ఎన్నికల కమీసన్ ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ వాయిస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడాన్ని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ
విద్వేషపూరిత ప్రసంగంపై వేలాది మంది పౌరులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చౌకబారు వ్యాఖ్యలపట్ల కూడా చర్యలు తీసుకోలేదన్నారు.బడే భాయ్ మరియు చోటే భాయ్ చేసిన కుట్ర. #KCRPoruBaata చూసి బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణుకుతున్నాయి? మీ అహంకారానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన సామాజిక మాధ్యమం x లో పోస్ట్ చేశారు.